భారతదేశం లో అయోద్య తరువత అతి ప్రాముఖ్యమైన రామ మందిరం లో భద్రాచలం ఒక్కటి ఏదీ తెలంగాణ రాష్ట్రం లో బద్రది కొత్తగూడెం జిల్లాలో ఉంది బద్రాచలం స్థల పురాణం బట్టీ బద్రాచలం దండకారణ్యం అని పిలువబడే అడవి ప్రాంతం. శ్రీరాముడు తన భార్య, తమ్ములతో వనవాసం చేస్తూ వున్నప్పుడు, ఈ ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తూ వున్న భరద్వాజ మహర్షి దగ్గరకు వచ్చాడు. ఆయన సూచన ప్రకారం ప్రస్తుతం భద్రాచలానికి దగ్గరలోనే వున్న పంచవటి అనేచోట ఒక వర్ణశాల నిర్మించుకొని అందులో వుంటూ వుండేవాడు.
ఆ పర్వతాల బయట, గోదావరి నది ఒడ్డున, ఒక రాతి మీద సీతారాములు కూర్చుండి విశ్రాంతి తీసుకుంటూ వుండేవారు. అలా ప్రతి రోజు తమకు సుఖాసనంగా వున్న రాతిని చూసి సీతాదేవి ఒకనాడు ఇంతకు ముందు రాతి రూపంలో వున్న అహల్యను కరుణించారు గదా, మరి ఈ రాతి మీద కూడా కరుణ చూపించగూడదా అని అడిగింది. దానికి శ్రీరాముడు, ఆ రాయి మరి కొంతకాలానికి తనకు మరింత ప్రీతిపాత్రమయ్యే జన్మ పొందుతుంది అని చెప్పాడు.
మేరువు అనే పర్వతరాజు హిమవంతుని తర్వాత మిక్కిలి శ్రేష్టుడు. ఆ మేరువునకు సంతానం లేదు. అందుకని ఆయన బ్రహ్మ దేవుని ప్రార్థిస్తూ తపస్సు చేశాడు. బ్రహ్మ యిచ్చిన వరంతో ఒక కొడుకు పుట్టాడు. అతనికి భద్రుడు అని పేరు పెట్టాడు. వశిష్ట మహర్షి వద్ద సకల విద్యలు నేర్పించాడు. ఆ భద్రుడు శ్రీరాముడు అంటే అమితభక్తి కలిగి నిరంతరమూ ఆయననే స్మరిస్తూ వుండేవాడు. ఒకనాడు వారి యింటికి నారద మహర్షి వచ్చాడు.
అంత చిన్న వయస్సులోనే అమిత భక్తి వైరాగ్య లక్షణాలతో వున్న ఆ పిల్లవాడినిచూసి, నారద మహర్షి ఆశ్చర్యపడి, దివ్యదృష్టి ద్వారా భద్రుడు ఒకప్పుడు రాతి రూపమే అయినా ఇప్పుడు మేరు పర్వత రాజుకు కుమారుడుగా జన్మించాడని తెలిసికొన్నాడు. వెంటనే భద్రునకు రామతారక మంత్రం ఉపదేశించాడు. అప్పుడు భద్రుడు గోదావరి నది ఒడ్డున ఇంతకు ముందు తాను రాతిరూపంలో వున్న ప్రదేశానికి చేరుకుని, రామతారక మంత్రం జపిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి శ్రీరాముడు ప్రత్యక్షమై, ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు.
శ్రీ రాముని పాదసేవ చేయడం తప్ప తనకు మరే వరము అక్కరలేదని చెప్పి, భద్రుడు, తన శిరస్సు మీద శ్రీరాముడు నిరంతరమూ నివసిస్తూ వుండేటట్లు వరం అడిగాడు. శ్రీరాముడు అలాగేనని చెప్పి, తనూ, తన భార్య, తమ్ములతో భద్రుని శిరస్సు మీద వెలసి ఉంటానని వరం యిచ్చాడు. భద్రుడు పర్వత రాజు యొక్క కుమారుడు గనుక, ఇక్కడ ఒక చిన్న కొండ రూపం ధరించి, సీతారామ చంద్రులను తన శిరస్సున మోస్తూ ఉన్నాడు. కనుక ఈ ప్రాంతానికి భద్రాచలం (భద్రునికొండ) అని పేరు వచ్చింది.
ఒకప్పుడు నాగలోకానికి రాజు అయిన ఆది శేషుడు రాక్షసుల వలన గొప్ప బాధలు ఎదుర్కొనవలసి వచ్చింది. ఆయన గోదావరి నది ఒడ్డుకు వచ్చి, ఒక అగ్నిగుండం రగిల్చి, హోమంచేసి, పరమ శివుని గూర్చి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఒక శూలాన్ని ప్రసాదించాడు. ఆ శూలం ధరించి ఆదిశేషుడు రాక్షసులను సంహరించాడు. ఆయన హోమంచేసిన చోట ఒక చిన్న గుంట ఏర్పడి ఒక కొలనుగా మారింది. దానికి శేష తీర్థమని పేరు వచ్చింది. హోమం చేసిన గుంట వల్ల ఏర్పడింది గనుక ఆ కొలనులో నీళ్లు వేడిగా వుంటాయి. అందుకే దీనిని ఉష్ణుగుండం అని గూడ అంటారు. భద్రాచలం అనే వూరుకు కొంచెం దూరంగా ఈ శేష తీర్ధం ఉంది.
శ్రీ సీతారాములు వనవాస కాలంలో ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు, శబరి అనే ఒకామె, ఈ అడవిలో దొరికే మధురమైన ఫలాలను వారికి యిచ్చి, స్వయంగా దగ్గరే కూచుని తినిపించింది. దానికి ఎంతో సంతోషించిన శ్రీరాముడు చరిత్రలో ఆమెపేరు శాశ్వతంగా వుండిపోయేటట్లు వరం యిచ్చాడు. ఆమె ఒక నది రూపంగా మారి ఇక్కడ ప్రవహిస్తూ, ఇప్పటికి శ్రీరాముని కొలుచుకుంటూ ఉంది. భద్రాచలం వూరుకు సుమారు ముప్పయి కి.మీ. దూరంలో వున్న ఈ శబరినది. ఇక్కడి నుంచి ప్రవహించుకుంటూ కొంత దూరం సాగిపోయి గోదావరి నదిలో కలుస్తుంది.
లో 1620 క్రీ.శ., ప్రాంతంలో ఈ భద్రాచలానికి దగ్గరలో వున్న ఒక గ్రామంలో, ఒకప్పుడు దమ్మక్క అనే స్త్రీ ఉండేది. ఒకనాడు రాత్రి ఆమెకు కలలో శ్రీరాముడు కనబడి, తను అక్కడకు దగ్గరలోనే అడవిలో, ఫలానా చోట పడివున్నానని చెప్పాడు. మరునాడు ఆమె గ్రామస్తులను పిలిచి తనకు వచ్చిన కల విషయం చెప్పి. వారిని వెంటబెట్టుకొని అడవిలోనికి వెళ్లి వెదకగా, రాళ్లు, ఆకుల మధ్య పడివున్న సీతారాముల విగ్రహాలు కనిపించాయి. ఆమె గ్రామస్తుల సహాయంతో ఆ విగ్రహాలను శుభ్రపరచి, అక్కడ ఒక చిన్న తాటియాకులు పాకవేసి అందులో ఆ విగ్రహాలను ప్రతిష్ఠించింది.